'పెద్ది' దెబ్బకు రికార్డులు షేక్... ఓవర్సీస్‌లో చరణ్ ఆల్ టైమ్ రికార్డ్!

  • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్
  • చరణ్ సోలో కెరీర్‌లో అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్
  • ఓవర్సీస్‌లో తొలిరోజు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు
  • నార్త్ అమెరికాలో 1.9 మిలియన్ డాలర్లు దాటిన కలెక్షన్లు
మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నిన్న‌ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా, తొలిరోజు నుంచే అంచనాలకు మించిన వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం రామ్ చరణ్ సోలో కెరీర్‌లోనే అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో 'పెద్ది' హవా 
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ 'పెద్ది' హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం వసూళ్ల వేట ఊహించని స్థాయిలో ఉంది. ట్రేడ్ వర్గాల అధికారిక నివేదికల ప్రకారం బుధవారం నాటి ప్రీమియర్ షోలు, మొదటి రోజు కలెక్షన్లు కలుపుకుని ఈ సినిమా ఇప్పటికే 1.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) మార్కును అధిగమించింది. శుక్రవారం నాటికి 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లో ఓవర్సీస్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ కావడం విశేషం. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్ నుంచి తొలిరోజు సుమారు రూ. 30 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభ, కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. విడుదల ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన 'పెద్ది', విడుదల తర్వాత ఆ అంచనాలను మించి ప్రదర్శన కనబరుస్తూ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించేలా కనిపిస్తోంది.

Ram Charan
Peddi
Buchi Babu Sana
Peddi Box Office Collection
Ram Charan Overseas Record
Mythri Movie Makers
Peddi USA Premiere Collection
Telugu Cinema News
Peddi Day 1 Collections
Ram Charan New Movie

More Telugu News